తాగునీటి సమస్య రావొద్దు..అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

తాగునీటి సమస్య రావొద్దు..అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క
  • మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం
  • మిషన్ భగీరథ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
  • అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు ప్రత్యేక బడ్జెట్
  • నీళ్ల పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మండలం యూనిట్​గా ఎంపీడీవో, ఇంట్రా ఏఈ, గ్రిడ్ ఏఈ, మండల స్పెషల్ ఆఫీసర్లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీస్​లో సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈలతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా తాగునీటి సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. వరుసగా పండుగలు వస్తున్నాయని, మూడు రోజులపాటు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలతో మిషన్ భగీరథ అధికారులు సమావేశం కావాలని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని, వారంలో 4 రోజులు మిషన్ భగీరథ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ పనులతో మిషన్ భగీరథ పైపులు దెబ్బతింటున్నాయని, దీనివల్ల అక్కడక్కడ తాత్కాలికంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనుల వల్ల మిషన్ భగీరథ పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా ఆవాసాల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానికంగా నీటి వనరులు అందుబాటులో లేకుంటే బోర్ వెల్స్ ను హైర్ చేసుకోవాలన్నారు. పదేండ్లలో వేల సంఖ్యలో బోర్లను పట్టించుకోకుండా వదిలేశారని, మేం వాటన్నింటికీ మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచామని చెప్పారు. మిషన్ భగీరథ వ్యవస్థ లేని గ్రామాలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలన్నారు. 

మిషన్ భగీరథ చైర్​పర్సన్​గా సీతక్క 

మిషన్ భగీరథకు ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. శుక్రవారం మంత్రి సీతక్క అధ్యక్షతన ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీస్​లో మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు చైర్ పర్సన్ గా మంత్రి సీతక్క, వైస్ చైర్మన్, ఎండీగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ నియమితులయ్యారు.

8 మంది డైరెక్టర్లుగా కె.రామకృష్ణారావు, టీకే శ్రీదేవి, జి.సృజన, జి. కృపాకర్ రెడ్డి, జి.అనిల్ కుమార్, పి.వెంకటేశ్వర రెడ్డి, పి. శ్రీనివాస్ రెడ్డి, జె. మధుబాబును నియమించారు. అనంతరం బోర్డు సమావేశంలో 23 అంశాలకు ఆమోదముద్ర వేశారు. గత బోర్డు మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలు, అమలు, పురోగతి నివేదిక తదితర అంశాలపై చర్చించారు. రీ కానిస్టిట్యూషన్ ఆఫ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, డిజైన్, డెవలప్​మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్స్ మానిటరింగ్ సిస్టం కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలను 2024--–25 కొనసాగింపునకు నోటిఫికేషన్ , 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్​మెంట్స్ కు అంగీకరించింది.

ప్రస్తుతం వినియోగిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ల సేవలను 2025--–26 ఏడాదికి కొనసాగింపు, ఇంటర్నల్ ఆడిటింగ్ కోసం ప్రస్తుతం ఉన్న సెక్రటేరియల్ ఆడిటర్స్ సేవలు కొనసాగిస్తూ నిర్ణయం, పైప్ లైన్ మరమ్మతులు, నిర్వహణపై అకౌంటింగ్ పాలసీ ప్రతిపాదనకు ఆమోదం, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగిన జల్ జీవన్ మిషన్ సమావేశానికి హాజరైన అధికారుల ప్రయాణ ఖర్చుల చెల్లింపు, 2022--–23 ఆర్థిక సంవత్సరంలో మిషన్ భగీరథ కనెక్షన్లను తొలగించిన కంపెనీల బకాయిలు రద్దు .. తదితర అంశాలను నూతన బోర్డు ఆమోదించింది. సమావేశానికి పీఆర్, ఆర్డీ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన తదితరులు హాజరయ్యారు.